Jhon cena: శకం ముగిసింది.. రెజ్లింగ్ కి జాన్ సీనా వీడ్కోలు ..

Jhon cena: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది. దశాబ్దాల పాటు రెజ్లింగ్ అభిమానులను ఉర్రూతలూగించిన అగ్రశ్రేణి రెజ్లర్ జాన్ సీనా తన రెజ్లింగ్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. ‘సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్’లో గుంథర్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో సీనా ఓటమి పాలయ్యారు.

దాదాపు 20 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్‌లో తొలిసారిగా జాన్ సీనా ‘టాప్ అవుట్’ కావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. గుంథర్ తన సిగ్నేచర్ స్లీపర్ హోల్డ్‌తో సీనాను బంధించగా, ఆ పట్టు నుంచి తప్పించుకోలేక సీనా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఫలితం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది.

ఈ చారిత్రక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కర్ట్ యాంగిల్, మార్క్ హెన్రీ, రాబ్ వాన్ డామ్, ట్రిష్ స్ట్రాటస్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజాలు హాజరయ్యారు. ది రాక్, కేన్ వంటి స్టార్ రెజ్లర్లు వీడియో సందేశాల ద్వారా జాన్ సీనాకు అభినందనలు తెలిపారు. మ్యాచ్ మొత్తం ఉత్కంఠభరితంగా సాగింది. గుంథర్ ఆధిపత్యం చూపించినప్పటికీ, జాన్ సీనా తన ఫైవ్-నకిల్ షఫుల్, ఆటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్ (AA) వంటి సిగ్నేచర్ మూవ్స్‌తో గట్టి పోటీ ఇచ్చారు.

అనౌన్సర్ టేబుల్‌పై గుంథర్‌కు ఏఏ ఇచ్చిన సీనా మ్యాచ్‌పై పట్టు సాధించినట్టే కనిపించినా, చివరి నిమిషాల్లో గుంథర్ తిరిగి ఆధిపత్యం సాధించాడు. చివరకు వచ్చిన ఓటమి అభిమానులకు జీర్ణించుకోలేనిదిగా మారింది. డబ్ల్యూడబ్ల్యూఈ బుకింగ్‌పై పలువురు అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

మ్యాచ్ అనంతరం రింగ్ మధ్యలో నిలిచిన జాన్ సీనా భావోద్వేగానికి లోనయ్యారు. తన బూట్లను రింగ్‌లో వదిలి రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు.

“ఇన్నేళ్లుగా మీకు సేవ చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. మీ ప్రేమే నాకు శక్తి” అని అభిమానులను ఉద్దేశించి చెప్పి, చప్పట్ల మధ్య రింగ్‌ను విడిచిపెట్టారు.

ఇలా రెజ్లింగ్ ప్రపంచంలో ఒక లెజెండ్ అధ్యాయం ముగిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *