Modi: తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా ఆయన అభివర్ణించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ను ఓడించడంలో క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి కీలక పాత్ర పోషించిందని మోదీ తెలిపారు.
తిరువనంతపురం విజయానికి శ్రమించిన బీజేపీ కార్యకర్తలను ప్రధాని అభినందించారు. కేరళ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరువనంతపురం అభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అన్నారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలను తాను పలుమార్లు ప్రశ్నించానని గుర్తు చేశారు.
ఎల్‌డీఎఫ్ పాలన నుంచి ప్రజలు బయటపడాలని తాను కోరుకున్నానని, తాజా ఫలితాలు అదే భావనను ప్రతిబింబిస్తున్నాయని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 101 వార్డులకు గాను బీజేపీ 50 స్థానాల్లో విజయం సాధించింది. ఎల్‌డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
