Vande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ Vande Bharat: వందే భారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై స్థానిక వంటకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శనివారం రైల్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రైళ్లు ప్రయాణించే ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయ రుచులు ప్రతిబింబించేలా ఆహారాన్ని అందించడం ద్వారా ప్రయాణికుల అనుభూతిని మెరుగుపరచవచ్చని ఆయన తెలిపారు. మొదటగా ఈ విధానాన్ని వందే భారత్ రైళ్లలో అమలు చేసి, అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకు విస్తరించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రత్యేక వంటకాలను ప్రయాణికులు ఆస్వాదించే అవకాశం లభించనుందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, రైలు టికెట్ బుకింగ్‌లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడంలో రైల్వే శాఖ కీలక చర్యలు తీసుకున్నట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో టికెట్లు బుక్ చేసే వారిని గుర్తించేందుకు పటిష్టమైన వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటివరకు 3.03 కోట్ల నకిలీ యూజర్ ఐడీలను శాశ్వతంగా రద్దు, మరో 2.7 కోట్ల ఐడీలను తాత్కాలికంగా నిలిపివేశామని వివరించారు. ఇంతకుముందు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రోజుకు లక్ష వరకు కొత్త యూజర్ ఐడీలు నమోదయ్యేవని, తాజా సంస్కరణల అనంతరం ఆ సంఖ్య రోజుకు సుమారు 5 వేలకే పరిమితమైందని మంత్రి వెల్లడించారు. దీంతో టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని తెలిపారు. సాధారణ ప్రయాణికులకు టికెట్లు సులువుగా లభించేలా మరిన్ని సంస్కరణలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో ఆధార్ ఆధారిత ఓటీపీ విధానం అమలులోకి తెచ్చినట్లు, దీని వల్ల నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ల లభ్యత గణనీయంగా పెరిగిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు