Delhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Delhi: మద్రాస్ హైకోర్టులో కేసుల లిస్టింగ్ మరియు విచారణ విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “అక్కడ ఏదో తప్పు జరుగుతోంది” అని వ్యాఖ్యానిస్తూ, హైకోర్టు నుంచి పూర్తి వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

నటుడు విజయ్ స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) పార్టీకి సంబంధించిన కరూర్ తొక్కిసలాట కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. మద్రాస్ హైకోర్టులోని రెండు బెంచ్‌లు ఒకే ఘటనపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇవ్వడం పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కరూర్ ఘటనపై సీబీఐ విచారణను మధురై బెంచ్ తిరస్కరించగా, మరోవైపు రోడ్‌షోలకు సంబంధించిన పిటిషన్‌పై చెన్నై బెంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టాలని ఆదేశించడం సరైన పద్ధతి కాదని గతంలోనే సుప్రీంకోర్టు పేర్కొంది.

విచారణలో జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ, “హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోంది. దీన్ని మేము పరిశీలించాల్సిందే” అని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్.కె. కౌల్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరారు. అయితే, ముందుగా హైకోర్టు అనుసరిస్తున్న లిస్టింగ్ విధానం, విచారణలోని అసంగతతలపై స్పష్టత వచ్చే వరకు ఆ అంశంపై నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం తెలిపింది.

కాగా, సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *