Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా?” అని హైకోర్టు ఈ సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ‘బుక్ మై షో’ సంస్థను ప్రశ్నించింది.
‘అఖండ 2’ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రోజున నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలను పాటించకుండా గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారని, అంతేకాకుండా అధిక ధరకు టికెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు, “కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?” అంటూ సీరియస్ అయ్యింది. దీనికి ‘బుక్ మై షో’ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులు తమకు చేరే లోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు.
అయితే, ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారా? లేదా? అని కోర్టు సూటిగా అడిగింది. మీపై కోర్టు ధిక్కరణ చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పండి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై కోర్టు మధ్యాహ్నం మరోసారి విచారణ జరపనుంది.
