Revanth Reddy: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాక సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఈనెల 13న జరగనున్న మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ దగ్గర ఆయన మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తాను కూడా ఒక అతిథిగా వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం అంతర్జాతీయ స్థాయిలో పేరున్న క్రీడాకారుడు వస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తున్నామని వివరించారు. ఢిల్లీలో తాను కలిసిన కాంగ్రెస్ నాయకులందరినీ ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్లో మెస్సీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరికొంతమంది అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొననున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద, మెస్సీ హైదరాబాద్ పర్యటనతో తెలంగాణలో ఫుట్బాల్ అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తోంది.
