Hyderabad

Hyderabad: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం

Hyderabad: హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఒక ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన శనివారం రాత్రి జరగగా, మెట్రో భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆ అనుమానాస్పద వస్తువు పట్టుబడింది.

బిహార్‌కు చెందిన మహమ్మద్ అనే యువకుడు, ప్రగతి నగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నాడు. అతడు శనివారం రాత్రి ఒక బ్యాగుతో మెట్రోలో ప్రయాణించడానికి మూసాపేట స్టేషన్‌కు వచ్చాడు. ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది సాధారణ స్కానింగ్ చేస్తుండగా, యంత్రం నుంచి బీప్ శబ్దం రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బ్యాగులో ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది, మహమ్మద్‌ను పక్కకు తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతని వద్ద 9 ఎంఎం (మిల్లీమీటర్) బుల్లెట్‌ లభించింది.

Also Read: Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం కలకలం.. దీపావళికి ముందే పెను ప్రమాదం!

మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ దొరకడం అనేది భద్రతా ఉల్లంఘనగా భావించిన సిబ్బంది, వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకుడిని, బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు.

సదరు యువకుడు బుల్లెట్‌ను ఎక్కడి నుంచి తెచ్చాడు, అది అతనికి ఎలా లభించింది అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. రోడ్డుపై దొరికిందా? లేక ఎవరైనా ఇచ్చారా? లేక మరెక్కడైనా దొంగిలించాడా? అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని వర్గాల సమాచారం మేరకు, మహమ్మద్ మైనర్ కావచ్చని, అందుకే పోలీసులు అతని తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చి, వారిని కూడా విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. యువకుడి వ్యవహార శైలి, అతను చెప్పే సమాధానాలపై పోలీసులు దృష్టి సారించారు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో ఇలా బుల్లెట్ దొరకడం నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *