Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా రైతులను కలవరపెట్టిన యూరియా (Urea) కష్టాలు తీరనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో తెలంగాణకు అదనంగా ఎరువుల కేటాయింపునకు కేంద్రం అంగీకరించింది.
ఇప్పటికే కేటాయించిన 40 వేల మెట్రిక్ టన్నులకు తోడు, మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. దీంతో మొత్తం 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల యూరియా కొరత ఏర్పడింది. పలు జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం ఆందోళనలు చేపట్టారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి అదనపు కేటాయింపును సాధించారు.
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే యూరియా పంపిణీని వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.