Tsunami Alerts

Tsunami Alerts: రష్యా తీరంలో భూకంపం.. సునామీ భయంతో వణికిపోతున్న జపాన్, ఇతర దేశాలు!

Tsunami Alerts: రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జూలై 30, 2025న) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైన ఈ పెను ప్రకంపనలు రష్యా తీర ప్రాంతాలతో పాటు జపాన్, అమెరికా, గ్వామ్ సహా పలు పసిఫిక్ దేశాలకు సునామీ ముప్పును తీసుకువచ్చాయి. ఈ భూకంప కేంద్రం జపాన్‌లోని హొక్కైడోకు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో, భూమికి 18 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. 2011 తర్వాత ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి.

సునామీ తాకిన తీరాలు..

భూకంపం వచ్చిన కొద్దిసేపటికే రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని హొక్కైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. రష్యాలోని సెవెరో-కురిల్స్క్ వద్ద ఓడరేవు నీట మునిగింది. ఇక్కడ నివసిస్తున్న దాదాపు 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సఖాలిన్ ద్వీపంలోని నివాసితులను కూడా ఖాళీ చేయిస్తున్నారు.

జపాన్‌లో 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడ్డాయి. టొకచాయ్ పోర్టులో 40 సెంటీమీటర్లు, ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్లు, హన్సంకిలో 30 సెంటీమీటర్ల అలలు నమోదయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సముద్రంలోకి వెళ్లవద్దని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తమైన అధికారులు ఫుకుషిమా దాయీచీ అణు కేంద్రం నుంచి ఉద్యోగులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. సెండాయ్ విమానాశ్రయాన్ని కూడా మూసివేసి, అక్కడికి వచ్చే విమానాలను దారి మళ్లించారు. కొన్ని చోట్ల భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

అమెరికాలోనూ హెచ్చరికలు..

రష్యా భూకంపం కారణంగా అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలకు తక్షణ ఖాళీ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్వామ్ ద్వీపాన్ని 1 నుండి 3 మీటర్ల ఎత్తులో అలలు తాకవచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం..

కామ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3-4 మీటర్ల ఎత్తుతో తాకాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎవరికీ గాయాలు లేకపోయినప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రి సెర్గీ లెబెడెవ్ తెలిపారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్స్క లో భవనాలు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విద్యుత్, సెల్‌ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఒక టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియరాలేదు.

Also Read: Honeymoon Murder: సినిమాగా రానున్న సంచలన హత్య కేసు!

ప్రపంచవ్యాప్తంగా సునామీ ముప్పు..

ఈ భారీ భూకంపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ వార్నింగ్ సిస్టం ఒక జాబితాను విడుదల చేసింది.

  • 3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు వచ్చే అవకాశం ఉన్న దేశాలు: ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు.
  • 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న ప్రాంతాలు: చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవులు.
  • 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న దేశాలు: అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినియా, ఫిలిప్పీన్స్, తైవాన్.
  • 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న దేశాలు: బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *