Rajya Sabha

Rajya Sabha: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 73 రాజ్యసభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల నుండి 6 మంది

Rajya Sabha: భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో ఈ ఏడాది భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం, ఈ ఏడాది మార్చి నుండి నవంబర్ మధ్య కాలంలో మొత్తం 73 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో, ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాజకీయ పార్టీలు ఇప్పుడే లెక్కలు మొదలుపెట్టాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి 10 మంది సభ్యులు విరమణ పొందుతుండగా, మహారాష్ట్ర నుండి ఏడుగురు, తమిళనాడు నుండి ఆరుగురు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రాజ్యసభ స్థానాల భర్తీ ఆసక్తికరంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉండగా, తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ బలాబలాల ప్రకారం, ఈ నాలుగు స్థానాలు కూడా అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఖాతాలోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేంద్రంలో కూటమి బలాన్ని మరింత పెంచనుంది.

ఇది కూడా చదవండి: World News: 2026 ఏడాదిపై బాబా వంగా, నోస్ట్ర‌డామ‌స్ చెప్పిందే నిజ‌మ‌వుతుందా?

తెలంగాణలో ఇద్దరు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కె.ఆర్. సురేష్ రెడ్డితో పాటు, ఇటీవల ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఎన్నికైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న మెజారిటీని బట్టి చూస్తే, ఈ రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. దీనివల్ల తెలంగాణ నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ బలం పెరగనుంది.

ఈ 73 స్థానాలకు జరిగే ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. గుజరాత్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాంల నుంచి ముగ్గురి చొప్పున సభ్యులు విరమణ పొందుతున్నారు. తెలంగాణ, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెండేసి ఖాళీలు ఏర్పడగా, ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం వంటి చోట్ల ఒక్కో స్థానం ఖాళీ కానుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాజ్యసభలో వివిధ బిల్లుల ఆమోదంపై మరియు పార్టీల బలాబలాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *