Hyderabad: హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా అసభ్య ప్రవర్తనలకు పాల్పడ్డ 644 మంది పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు వారాలుగా నగరంలోని వివిధ దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల్లో మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠినంగా స్పందించారు.
ఈ అరెస్టుల్లో 94 మంది మైనర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మహిళలకు అసభ్యంగా ప్రవర్తించడం, ఆలయాల వద్ద భద్రతా సమస్యలు సృష్టించడం వంటి కేసుల్లో వీరిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఏడుగురు నిందితులకు స్థానిక కోర్టు వారం రోజుల జైలు శిక్షను విధించింది.
పండుగల్లో మహిళలు, కుటుంబాలు భద్రతగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇటువంటి అవాంఛనీయ చర్యలకు సహకరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.