Hyderabad

Hyderabad: రాజేంద్రనగర్‌లో విషాదం.. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఆరు నెలల చిన్నారి బలి

Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. బండ్లగూడ జాగీర్‌లోని క్రేయాన్స్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఆరు నెలల మగ శిశువు కన్నుమూశాడు. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. విష్ణువర్ధన్ రెడ్డి, అశ్విని దంపతుల కుమారుడికి గత కొంతకాలంగా జ్వరం వస్తోంది. దీంతో తల్లిదండ్రులు బాబును చికిత్స కోసం క్రేయాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అభిషేక్ పర్యవేక్షణలో బాలుడికి వైద్యం అందించారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో చిన్నారి పరిస్థితి విషమించి మరణించాడు. ఆడుకోవాల్సిన వయసులో బాబు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాబుకు ఎక్సపీరిడ్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే ప్రాణాలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ముందు బాధితులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *