Ekaveera: నటరత్న యన్టీఆర్, నటప్రపూర్ణ కాంతారావు, జమున, కె.ఆర్.విజయ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చారిత్రక నవలా చిత్రం ‘ఏకవీర’. విశేషమేంటంటే కాలేజీ రోజుల్లో యన్టీఆర్ కు గురువైన విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘ఏకవీర’ నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందింది. 1969 డిసెంబర్ 4వ తేదీన ‘ఏకవీర’ విడుదలయింది. సి.యస్.రావు దర్శకత్వంలో డి.యల్.నారాయణ,, బి.ఏ, సీతారామ్ నిర్మించిన ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి సంభాషణలు రాయడం విశేషం! ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం, దేవులపల్లి, సి.నారాయణ రెడ్డి పాటలు ఓ కళను తీసుకు వచ్చాయి. కథానుగుణంగా చిత్రంలోని ప్రధాన పాత్రలన్నీ చనిపోతాయి. ఆ రోజుల్లో యన్టీఆర్, కాంతారావు మేటి జానపద కథానాయకులు. వారు చనిపోవడం అంటే … అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. దాంతో ‘ఏకవీర’ పరాజయం పాలయింది. ఇందులోని పాటలు మాత్రం ఈ నాటికీ సంగీతాభిమానులను రంజింప చేస్తూనే ఉన్నాయి.
