Congo: ఆఫ్రికా దేశం కాంగోలో అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) తిరుగుబాటుదారులు మళ్లీ రక్తపాతం సృష్టించారు. ఇస్లామిక్ స్టేట్ మద్దతు పొందిన ఈ ముష్కరులు కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా 52 మందిని హతమార్చినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ఓటమి పాలైన ఆగ్రహంతోనే ఈ నరమేధానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
నిద్రలోంచి లేపి ఊచకోత
బెని, లుబెరో ప్రాంతాల్లో నివాసాలపై దాడులు చేసిన ఏడీఎఫ్ ముష్కరులు, ప్రజలను నిద్రలోంచి లేపి తాళ్లతో కట్టి కిరాతకంగా నరికి చంపారు. మెలియా గ్రామంలోనే దాదాపు 30 మందిని హతమార్చారు. ఈ దాడిలో 8 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 52 మంది మృతి చెందారు. దాడి తర్వాత ఇళ్లకు కూడా నిప్పంటించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు.
ఇటీవలే చర్చి దాడి
కొద్ది రోజుల క్రితం కూడా ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు ఓ క్యాథలిక్ చర్చిపై కాల్పులు జరిపి 38 మందిని చంపారు. పౌరులపై నిరంతరం దాడులు జరుపుతున్న ఈ సంస్థపై స్థానికుల భయం పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: మోదీ భజనలో బిజీగా ఉన్న ఎంపీలు..
ఏడీఎఫ్ చరిత్ర, ఉగ్రవాద సంబంధాలు
1995లో రెండు ఉగాండా తిరుగుబాటు గ్రూపుల కలయికతో ఏడీఎఫ్ స్థాపించబడింది. 1996లోనే ఉగాండా పట్టణాలపై మొదటి దాడులు జరిపింది. 2014 తర్వాత కాంగో నార్త్ కివు ప్రాంతంలో సామూహిక హత్యలకు పాల్పడింది. అనంతరం ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో సంబంధాలు ఏర్పరచుకొని మరింత క్రూర దాడులు చేపట్టింది. 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 వేల మంది పౌరులు ఏడీఎఫ్ దాడులకు బలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఆంక్షలు, ఆపరేషన్లు కొనసాగుతూనే
ఏడీఎఫ్‌పై అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఉగాండా, కాంగో సైన్యాలు సంయుక్త ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఐరాస శాంతి పరిరక్షక దళాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నా.. ఏడీఎఫ్ దాడులను అదుపు చేయడంలో ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి.