GST: దక్షిణ భారతదేశంలో అల్పాహారం అంటే ముందుగా గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశలు. వీటిపై 5% జీఎస్టీ విధించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే చపాతీ, పరోటాలపై జీఎస్టీని 18% నుంచి సున్నాకి తగ్గించడం, ఇడ్లీ, దోశలపై పన్ను విధించడం పట్ల చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం దక్షిణాది ప్రజల ఆహార అలవాట్లపై పన్ను రూపంలో వివక్ష చూపుతోందని నెటిజన్లు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఇడ్లీ, దోశలు కేవలం సంప్రదాయ ఆహారమే కాదు, ఇది దక్షిణాది ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగం. దీనిపై పన్ను విధించడం అనేది వారి జీవనశైలిపై నేరుగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఈ పన్ను విధానం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ ఆహార అలవాట్ల ఆధారంగా పన్నులు విధించడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు. ఇలాంటి పన్ను విధానం దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను పెంచుతుందని, ఇది జాతీయ సమైక్యతకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, ఇడ్లీ, దోశలపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని దక్షిణాది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతీయ ఆహార సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా, ఈ పన్ను విధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.