Earthquake: ఈశాన్య భారతదేశంలోని అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో బలమైన ప్రకంపనలు రాగా, త్రిపురలోని గోమతి జిల్లాలో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) అధికారికంగా ధృవీకరించింది. భూకంప కేంద్రం మోరిగావ్ సమీపంలో భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మోరిగావ్, గోమతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి వీధుల్లోకి పరుగులు తీశారు. అస్సాం, త్రిపురలతో పాటు పొరుగు రాష్ట్రమైన మేఘాలయలో కూడా పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, కొన్ని ప్రాంతాల్లోని పాత భవనాలకు చిన్నపాటి పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
