Cigarette Prices: కొత్త ఏడాదిలో పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై అదనపు పన్నులు విధిస్తూ తీసుకున్న నిర్ణయం వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జాతీయ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025’ను పార్లమెంటులో ఆమోదించింది. ఈ తాజా పన్నుల భారంతో ఫిబ్రవరి నుంచి పొగాకు ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరనున్నాయి.
పన్నుల విధింపు ఇలా..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సిగరెట్లు, పాన్ మసాలాపై గరిష్టంగా 40 శాతం జీఎస్టీ (GST) విధించనున్నారు. బీడీలపై 18 శాతం పన్ను వర్తించనుంది. అయితే కేవలం జీఎస్టీతోనే సరిపెట్టకుండా, పాన్ మసాలాపై తయారీ సామర్థ్యాన్ని బట్టి అదనపు సెస్‌ను కూడా ప్రభుత్వం వసూలు చేయనుంది. దీనికి తోడు పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పబ్లిక్ హెల్త్ మరియు దేశ రక్షణ వ్యవస్థల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: Youtuber Anvesh Case: త్వరలో భారత్‌కు యూట్యూబర్ అన్వేష్?
ప్రభుత్వ నిర్ణయం వల్ల మార్కెట్‌లో సిగరెట్ల ధరలు ఊహించని రీతిలో పెరగనున్నాయి. ప్రస్తుతం సుమారు రూ. 18 కి లభిస్తున్న ఒక్కో సిగరెట్ ధర, ఫిబ్రవరి 1 నుండి ఏకంగా రూ. 72 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరగడం వల్ల తక్కువ ఆదాయ వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధరలు భరించలేక ధూమపానం మానేయడమే ఉత్తమమని కొందరు అంటుంటే, సిగరెట్ల బదులు బీడీలతో సరిపెట్టుకుంటామని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కుప్పకూలిన సిగరెట్ కంపెనీల షేర్లు
ప్రభుత్వం పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. దేశంలోని అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ (ITC) షేరు ధర బీఎస్‌ఈలో 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు కూడా దాదాపు 10 శాతం మేర నష్టపోయాయి. ధరల పెరుగుదల వల్ల భవిష్యత్తులో ఈ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయన్న భయాందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. మొత్తానికి, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు వినియోగదారులకు, ఇటు వ్యాపార దిగ్గజాలకు భారీ సవాలుగా మారింది.
