Laddu Adulteration: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా దర్యాప్తు చేస్తున్న ఈ ప్రత్యేక బృందం నలుగురిని అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన ఈ అరెస్టులతో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్టయింది
Laddu Adulteration: తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌తో సంబంధం ఉన్న కీలక వ్యక్తులను తిరుపతిలో మూడు రోజులుగా ప్రశ్నించారు. అయితే, వారు దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిసింది. అదీకాకుండా కల్తీ నెయ్యి సంఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో వారిని ఆదివారం అరెస్టు చేసినట్లు తెలిసింది.
ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ , ఏఆర్ డైరీలతో సంబంధం ఉన్న విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చవాడా, రాజశేఖర్‌లను అరెస్టు చేశారు. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తారని చెబుతున్నారు.
Laddu Adulteration: ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సీబీఐ నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కళేబరాల అవశేషాలు ఉన్నాయని నివేదించబడింది. ఈ నేపథ్యంలో, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతూ చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Laddu Adulteration: ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, పెద్ద ఎత్తున దర్యాప్తు నిర్వహించడానికి సీబీఐ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీబీఐ హైదరాబాద్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళీ రాంబా, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, రాష్ట్ర ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ అధికారి సత్యకుమార్ పాండ్యా నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది.