Amazon

Amazon: అమెజాన్‌లో 1800 మంది ఇంజినీర్ల తొలగింపు

Amazon: ప్రముఖ అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఇటీవల ప్రకటించిన 14 వేల కార్పొరేట్ ఉద్యోగాల తొలగింపు నిర్ణయం టెక్ ప్రపంచంలో కలకలం సృష్టిస్తోంది. ఈ భారీ లేఆఫ్‌ల ప్రభావం కంపెనీలోని వివిధ విభాగాలపై పడుతుండగా, ముఖ్యంగా ఇంజినీర్ల బృందం తీవ్రంగా ప్రభావితమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

తొలగింపులలో 40 శాతం మంది ఇంజినీర్లే
న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాలలో నమోదైన తొలగింపుల రికార్డులను పరిశీలిస్తే, ఈ నాలుగు రాష్ట్రాలలోనే 4,700 మందికి పైగా ఉద్యోగులు లేఆఫ్ జాబితాలో ఉన్నారు. వీరిలో సుమారు 40 శాతం మంది అంటే దాదాపు 1,800 మంది ఇంజినీర్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. మిగిలిన రాష్ట్రాల తొలగింపుల డేటా కూడా వెల్లడైతే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఏఏ విభాగాల్లో ఎంత మందిని తొలగిస్తున్నారనే దానిపై మరింత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. క్లౌడ్ సర్వీసెస్ (AWS), రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ వంటి కీలక విభాగాలన్నింటిలోనూ ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది.

Also Read: Nara Bhuvaneshwari: ఎలారిక్కిం సౌగ్యమా?: తమిళంలో పలకరించిన నారా భువనేశ్వరి

ఏఐ శకం కోసమే ఈ వ్యూహం
అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ పలుమార్లు ప్రస్తుత శకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శకమని ప్రకటించిన నేపథ్యంలో ఈ భారీ లేఆఫ్‌ల నిర్ణయం వెలువడింది. కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు అక్టోబర్‌లోనే ప్రకటించింది.

కస్టమర్ల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ కొత్త పంథాలో ముందుకు సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెతత్ గలెట్టి ఉద్యోగులకు రాసిన సందేశంలో పేర్కొన్నారు. ఈ మార్పులో భాగంగానే కంపెనీలో అనవసర లేయర్‌లను తొలగించడం, బ్యూరోక్రసీని తగ్గించడం, వనరులను సంపూర్ణంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. సంస్థాగత మార్పులు, పునర్వ్యవస్థీకరణ పేరుతో తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది టెక్ ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *