Inter Exams 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా జరగాలని ఇంటర్ బోర్డు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ, కొందరు విద్యార్థులు అక్రమ మార్గాల్లో పరీక్షలు రాస్తూ పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా బుధవారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా 16 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. ఈ ఏడాది పరీక్షలు మొదలైనప్పటి నుంచి ఒక్కరోజే ఇంతమంది విద్యార్థులు పట్టుబడటం ఇదే మొదటిసారి. హనుమకొండ జిల్లాలో పది మంది, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఖానాపురం మండలంలోని ఒక జూనియర్ కాలేజీలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా, అక్కడ మరో ముగ్గురు విద్యార్థులు చిట్టీలతో దొరికిపోయారు.
పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉన్నప్పటికీ విద్యార్థులు ఇటువంటి తప్పులు చేయడం వల్ల వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పట్టుబడిన విద్యార్థులపై ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, బుధవారం జరిగిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 97.24 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాయాలని, అక్రమ మార్గాలను ఎంచుకుని తమ విలువైన విద్యా సంవత్సరాన్ని వృధా చేసుకోవద్దని అధికారులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. పరీక్షలు ముగిసే వరకు నిఘా ఇంకా కఠినంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.
