Sangareddy: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, సంగారెడ్డి జిల్లాలోని మోర్గి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురికావడంతో, వెంటనే వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
నిద్రపోతున్న విద్యాశాఖ మంత్రి?
ఇన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంకా నిద్రలేవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ఎందుకు పర్యవేక్షణ కొరవడుతోందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నిచోట్ల విద్యార్థులు ఆసుపత్రి పాలైతే, మరికొన్నిచోట్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.
అలసత్వంపై ఆగ్రహం:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే. వారి ఆరోగ్యంపై ఇలాంటి అలసత్వం ప్రదర్శించడం దారుణమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నారు.