Georgia: జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో దారుణం జరిగింది. అందులో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని ఆ దేశంలోని భారతీయ దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వీరంతా కార్బన్ మోనోక్సైడ్ విషవాయువు పీల్చడం కారణంగా మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో గమనించామని, మరింత లోతుగా విశ్లేషిస్తు్న్నామని జార్జియా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.కాగా, పవర్ జనరేటర్ నుంచి కార్బన్ మోనోక్సైడ్ విడుదలైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇతమిత్ధమైన కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు కూడా చేపట్టినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. జార్జియా క్రిమినల్ కోడ్ 116 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

