10th Result-2025: పదో తరగతి ఫలితాలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల (ఏప్రిల్) 30న ఫలితాలను విడుదల చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సారి మెమోలో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిసింది. పదో తరగతి ఫలితాలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.
10th Result-2025: పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. విద్యాశాఖ సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉండటంతో ఆయన అనుమతి కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఆయన చేతులమీదుగానే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
10th Result-2025: పదో తరగతి మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న ఈ సమయంలో ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలను జారీ చేశారు. గతంలో గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవారు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టుల్లో గ్రేడింగ్‌తోపాటు విద్యార్థికి వచ్చిన మార్కులను మెమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేదేశాల్లో పేర్కొన్నారు.
10th Result-2025: గతంలో విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీని వల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం తేలకపోయేది. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చడంతో గ్రేడ్లతోపాటు సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగతా 20 అంతర్గత మార్కులుగా ఇస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేసేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తున్నది.