Free Launch Offer Scam: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని చెందిన మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. “ఫ్రీ లాంచ్ ఆఫర్” ముసుగులో వందలాది మంది గృహ కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ప్రీ-లాంచ్, ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో తక్కువ ధరలకు ఇళ్లు, ప్లాట్లు ఇస్తామని ప్రచారం చేస్తూ జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ముందుగా డబ్బులు చెల్లిస్తే త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని, మార్కెట్ ధర కంటే తక్కువకే ఆస్తులు అందిస్తామని హామీలు ఇచ్చి మధ్యతరగతి ప్రజలను ఆకర్షించినట్లు ఈడీ గుర్తించింది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయని, కొన్ని చోట్ల అసలు పనులు కూడా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. డబ్బులు తిరిగి అడిగిన వారికి రిఫండ్ ఇవ్వకుండా తప్పించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఈడీ, ఇటీవల హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించింది. కాకర్ల శ్రీనివాస్ నివాసంతో పాటు జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్ అండ్ బిల్డర్స్, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్ వంటి పేర్లతో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో ప్రీ-లాంచ్ స్కీమ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డిపాజిట్లకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
Also Read: Droupadi Murmu: పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ‘పారదర్శకత’ ప్రాణం..
ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ.300 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఈడీ అంచనా వేసింది. వసూలు చేసిన నిధులను వివిధ షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు, వ్యక్తిగత ఖర్చులు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా వినియోగించినట్లు ఆధారాలు లభించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఎక్కువ మొత్తం బయటపడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
ఇదివరకే బాధితుల ఫిర్యాదులపై తెలంగాణ పోలీసులు కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన తర్వాత అతడు పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. చెన్నైలో అతని ఆచూకీ లభించడంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకుంది.
అరెస్ట్ అనంతరం శ్రీనివాస్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఎలా ప్రచారం నిర్వహించారు, ఎంతమంది నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు, ఆ డబ్బు ఎక్కడికి మళ్లించారన్న అంశాలపై ఈడీ లోతైన విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసిన అధికారులు, ఇంకా మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కేసులో అక్రమంగా సంపాదించిన ఆస్తులపై అటాచ్‌మెంట్ చర్యలు కూడా చేపట్టే అవకాశముందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

