కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని తెలిసినప్పటి నుంచి అది చాలా మందిని బాధపెట్టిందని ఆయన తెలిపారు. ఇది నమ్మలేని భయంకర నిజం అని ఆయన అభివర్ణించారు. అసలు తిరుమల లడ్డూ కోసం నెయ్యి సేకరించడానికి టెండర్ ప్రక్రియను ఎంచుకోవడమే తప్పని ఆయన అభిప్రాయాపడ్డారు.
ఈ విషయాలపై నిజానిజాలు వెలికి తీయడం కోసం విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదుల చేశారు. జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరడం సమంజసమే అని ఆయన అన్నారు. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయడానికి ఇది ఉపయోగపడుతుందని రంగనాధన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ విషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. తిరుమల పవిత్రతను కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.