Amir Khan Muttaqi: భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ….. పాకిస్థాన్ కు గట్టి హెచ్చరిక చేశారు. లష్కరేతోయిబా, జైషే మహమ్మద్ వంటి పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలు అప్గాన్ గడ్డ నుంచి కార్యకలాపాలు సాగించలేవని స్పష్టంచేశారు. గడిచిన నాలుగేళ్లలో ఉగ్రవాదులందరినీ తాలిబన్లు అంతమొందించారన్న ముత్తాఖీ.. పాకిస్థాన్ కూడా తమలాంటి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని హితవుపలికారు. అఫ్గాన్ లో ఇంచు భూమి కూడా ఉగ్రవాదుల నియంత్రణలో లేదన్నారు. కాబూల్ లో జరిగిన బాంబు దాడులపై స్పందించిన తాలిబన్ మంత్రి.. పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఆఫ్గన్ల ధైర్యాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు. సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడిగితే తమ సత్తా తెలుస్తుందన్న తాలిబన్ మంత్రి.. ఆఫ్గనిస్తాన్ తో ఆటలు ఆడటం మంచిది కాదని వారు చెబుతారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: TG Congress: టెండర్ల వార్.. అధిష్టానానికి మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ ఫిర్యాదు
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లోని భారత సాంకేతిక మిషన్ ను రాయబార కార్యాలయం హోదాకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి S జైశంకర్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీతో జై.శంకర్ సమావేశమయ్యారు. అఫ్గానిస్థాన్ లో ఆరు కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ తెలిపారు. 20 అంబులెన్స్ లను అఫ్గాన్ కు బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. MRI , CT స్కాన్ మెషీన్లను సమకూర్చడంతో పాటు, రోగనిరోధక వ్యాక్సిన్లను కూడా భారత్ సరఫరా చేయనుందని జైశంకర్ వెల్లడించారు. 2021లో అమెరికా సైన్యం వైదొలగడంతో అఫ్గాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అఫ్గాన్ లో భారత్ తన రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్ లను మూసివేసింది. తాజా చర్చల్లో ఎంబసీని తిరిగి తెరిచేందుకు భారత్ సిద్ధమైనట్టు జైశంకర్ ప్రకటించారు.