Hindu Rate Of Growth: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఉద్దేశపూర్వకంగా హిందూ జీవన విధానంతో ముడిపెట్టే ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అనే పదాన్ని వక్రీకరించి, హిందూ విశ్వాసాన్ని కించపరిచేందుకు ఉపయోగించారని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యల సారాంశం
23వ హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచించడానికి ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది హిందూ జీవన విధానాన్ని కించపరిచే దుష్ప్రయత్నంగా అభివర్ణించారు.
ప్రస్తుతం ప్రపంచం విచ్ఛిన్నం, అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ ఒక వారధిగా నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉన్నా, భారత్ మాత్రం వృద్ధి కథలను రాస్తుందని, ప్రపంచంలో విశ్వాసం తగ్గినప్పుడు, భారత్ నమ్మకానికి స్థంభంలా ఉంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
అసలు ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అంటే ఏమిటి?
ఈ వివాదాస్పద పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్‌కృష్ణ 1978లో తొలిసారిగా ఉపయోగించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ముఖ్యంగా 1950ల నుంచి 1980ల వరకు, భారతదేశ జీడీపీ వృద్ధిరేటు సంవత్సరానికి సుమారు 3.5%–4% మాత్రమే ఉండేది. ఈ నెమ్మదైన, నిలకడ లేని వృద్ధిరేటును సూచించడానికి రాజ్‌కృష్ణ ఈ పదాన్ని వాడారు. ‘తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి’ కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదనే భావనను ఈ పదం ప్రజల్లోకి తీసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: IndiGo Crisis: ఇండిగో సంక్షోభం.. రీఫండ్‌లపై కీలక ప్రకటన చేసిన కంపెనీ
ఆర్థికవేత్తల విమర్శలు, వివాదాలు
ఈ నెమ్మదికి హిందూ సంస్కృతి కారణం కాదని, నిజానికి దీనికి కారణం నాటి ప్రభుత్వ విధానాలు, భారీ ప్రభుత్వ నియంత్రణ, మరియు నిర్బంధ నియామాలేనని మెజారిటీ ఆర్థికవేత్తలు బలంగా వాదించారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిని ఒక మతానికి ఆపాదించడం అన్యాయం అని వారు ఎత్తిచూపారు.
ఎప్పుడు పాతబడింది? 1990లలో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరించబడిన తర్వాత వృద్ధిరేటు పుంజుకుంది. దాంతో, ఈ ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అనే పదం క్రమంగా కనుమరుగై, పాత పదంగా మారింది. 2023లో, మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారతదేశం ప్రమాదకరంగా తిరిగి ఈ ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’కు దగ్గరగా ఉందని చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వివాదాన్ని రాజేశాయి.
ఈ వ్యాఖ్యలపై ఎస్‌బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ స్పందిస్తూ, ఇది తప్పుడు అంచనాగా మరియు పక్షపాతపూరిత వ్యాఖ్యగా విమర్శించారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలు దశాబ్దాల పాత ఈ పదంలోని అన్యాయాన్ని, ఉద్దేశపూర్వక వక్రీకరణను మరోసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చాయి. మారుతున్న ప్రపంచంలో భారత్ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ తరుణంలో, ఈ పదాన్ని తిరిగి ప్రస్తావించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

