Green Card: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో నేషనల్ గార్డ్ దళాలపై జరిగిన కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు నేషనల్ గార్డులలో ఒకరు, మహిళా గార్డ్ అయిన సారా బెక్‌స్ట్రోమ్, ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. మరొక గార్డ్ పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాల కోసం పోరాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ భయంకర పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 19 దేశాలకు చెందిన శాశ్వత నివాసులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ల వలస స్థితిని సమగ్రంగా పునఃసమీక్షించాలని ఆదేశించారు.
వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిపిన అనంతరం భద్రతా దళాలు ఒక ఆఫ్ఘనిస్థాన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నాయి. అమెరికన్ అధికారుల గుర్తించిన వివరాల ప్రకారం, ఈ నిందితుడు గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికన్ దళాలతో కలిసి పనిచేసిన వ్యక్తి. 29 ఏళ్ల ఈ నిందితుడికి 2021 తాలిబాన్ స్వాధీనం తర్వాత, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆశ్రయం (Asylum) లభించిందని, అయితే అది శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కాదని ఆఫ్ఘన్ఎవాక్ అనే సంస్థ పేర్కొంది.
Also Read: Rahul Mamkootathil: కేరళ రాజకీయాల్లో సంచలనం.. సస్పెండెడ్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, అఫ్గానిస్థాన్‌తో సహా మరో 18 దేశాల నుంచి వచ్చిన ప్రతి గ్రీన్ కార్డ్ హోల్డర్ యొక్క ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను కఠినంగా పునఃపరిశీలించాలని తాను ఆదేశించినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపారు.
ట్రంప్ ప్రభుత్వం జూన్‌లో 19 దేశాలను “ఆందోళన కలిగించే దేశాలు (Recognized Concern)”గా వర్గీకరిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు (Executive Order) జారీ చేసింది. ఈ ఉత్తర్వులో మొత్తం 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని దాదాపుగా నిషేధించారు. పూర్తి నిషేధం ఎదుర్కొన్న దేశాలు అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో-బ్రాజావిల్లే, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్.
అదనంగా, మరో ఏడు దేశాలకు చెందిన ప్రయాణికులపై కూడా ట్రంప్ పాక్షికంగా ప్రయాణ నిషేధం విధించారు, వీటిలో క్యూబా, వెనిజులా వంటి దేశాలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన సమయంలో ఆయా దేశాల నుంచి వచ్చిన వలసదారుల వివరాలను తాజాగా ట్రంప్ ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించనుంది. వైట్‌హౌస్ సమీపంలో జరిగిన ఈ దాడి, అధ్యక్షుడు ట్రంప్‌కు ఇమ్మిగ్రేషన్ విధానాలను మరింత కఠినతరం చేయడానికి కారణంగా మారింది.

