Delhi: ఉబర్, ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ సంస్థలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం స్పందించింది. ఈ సంస్థలు ఫోన్ ధర ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఉబర్, ఓలా సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
అదే సమయంలో, ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై, కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలు తీసుకుంది. ఒకే సర్వీసుకు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయించారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ధరలలో వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది. ఛార్జీల విషయంలో పారదర్శకత మరియు నిజాయతీ తీసుకువచ్చేందుకు సరైన వివరణ ఇవ్వాలని సూచించింది.
ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి ఎక్స్ వేదికపై పోస్ట్ చేసి, ఉబర్ సంస్థ ఫోన్ ధరలు మాత్రమే కాకుండా, అందులోని బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా కూడా ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లతో బుకింగ్ ను పరిశీలించి ఈ ధరల తేడాను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

