Vikarabad: జీవితంపై విరక్తి చెంది ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం పరిధిలోని గడ్డమీది గంగారంలో చోటు చేసుకుంది. తన భర్త పెడుతున్న తీవ్ర వేధింపులు భరించలేక, కేవలం ఐదు నెలల క్రితమే వివాహమైన శిరీష (21) అనే యువతి ఉరేసుకుని చనిపోయింది.
ధారూరు సీఐ రఘురామ్ తెలిపిన వివరాల ప్రకారం, గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన శిరీషకు, పరిగి మండలం మల్లమోనిగూడేనికి చెందిన శివలింగంతో ఐదు నెలల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లైనప్పటి నుంచి శివలింగం చిన్న చిన్న కారణాలకే శిరీషను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. “నువ్వు వంట సరిగ్గా చేయట్లేదు”, “నాకంటే తక్కువ చదువుకున్నావు” అంటూ అవమానించేవాడు, అంతేకాకుండా శారీరకంగా చితకబాదేవాడు. మంగళవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన శివలింగం, శిరీషను తీసుకువెళ్లి ఆమె పుట్టింట్లో వదిలిపెట్టాడు. అంతేకాక, ఆమె ఫోన్‌ను కూడా తనతో తీసుకెళ్లిపోయారు.
Also Read: Telangana: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు!
బుధవారం ఉదయం శిరీష తల్లి కూలి పనులకు వెళ్తూ కూతురికి ఫోన్ ఇచ్చి వెళ్లింది. పుట్టింట్లో ఉన్న శిరీష, భర్తకు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో శివలింగం ‘నువ్వు నాకు అక్కర్లేదు, అక్కడే చచ్చిపో’ అంటూ ఎంతో కఠినంగా మాట్లాడి, చీదరించుకున్నాడు.
భర్త నోటి నుంచి వచ్చిన ఆ మాటలతో శిరీష తీవ్ర మనస్తాపానికి, ఆవేదనకు గురైంది. భర్త వేధింపులు, తిరస్కరణ భరించలేక, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి, కూతురు ఉరికి వేలాడుతూ కనిపించడంతో గుండెలవిసేలా రోదించింది.
భర్తపై కేసు నమోదు, దర్యాప్తు
శిరీష తల్లి గంజి మల్లమ్మ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. తమ కూతురు మరణానికి అల్లుడే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఆత్మహత్యకు ముందు శివలింగంతో ఫోన్‌లో జరిగిన సంభాషణలను సాక్ష్యంగా పోలీసులు సేకరించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, భర్త శివలింగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిపి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

