Tollywood: భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమైన లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ‘చెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డుకు తోట తరణి ఎంపికయ్యారు.
ఈ పురస్కారం నవంబర్ 13న చెన్నైలోని అలయన్స్ ఫ్రాంకైస్‌లో జరగబోయే కార్యక్రమంలో ఫ్రెంచ్ రాయబారి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ఈ గౌరవం పొందిన ఆరో భారతీయుడిగా తోట తరణి నిలవనున్నారు.
ఇంతకు ముందు ఈ అవార్డును దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే, నటులు శివాజీ గణేశన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ అందుకున్నారు.
సినీ ప్రస్థానం, అవార్డులు
1978లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రంతో తోట తరణి తన కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత మణిరత్నం, శంకర్ వంటి అగ్ర దర్శకులతో కలిసి ‘నాయకుడు’, ‘సాగర సంగమం’, ‘గీతాంజలి’, ‘దళపతి’, ‘శివాజీ’, ‘దశావతారం’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
తన ప్రస్థానంలో ఆయన రెండు జాతీయ అవార్డులు, మూడు నంది అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.
అభినందనల వెల్లువ
‘చెవాలియర్’ అవార్డు ప్రకటించిన తర్వాత తోట తరణిపై సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ వెల్లువెత్తింది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందిస్తూ“తన అద్భుతమైన నైపుణ్యంతో ఊహలకు ప్రాణం పోసిన ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఎంతో గర్వకారణం,” అని పేర్కొన్నారు.
అలాగే ఇటీవల ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆవిష్కరించిన పెరియార్ చిత్రాన్ని తోట తరణి అత్యద్భుతంగా రూపొందించారని గుర్తుచేశారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా కూడా తన ఎక్స్ పోస్ట్‌లో “ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే చెవాలియర్ అవార్డుకు ఎంపికైన తోట తరణి గారికి హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు.

