ACB Raids: ఇరిగేషన్ శాఖలో పనిచేసి ఇటీవలే ఏసీబీకి చిక్కిన ఓ ఉద్యోగి కోట్లకు పడగలెత్తాడని తేలుతున్నది. తవ్వుతున్నా కొద్దీ కోట్ల గుట్టలు బయటపడుతున్నాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా 150 కోట్లకు పైగా బయటపడ్డాయి. ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎంత మేరకు బయటపడుతాయో తేలాల్సి ఉన్నది. ఏసీబీ ఏకకాలంలో జరుపుతున్న ఈ తనిఖీల్లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెల్లడవుతున్నాయి.
10 నెలల క్రితం హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని రెడ్‌హిల్స్ లో ఉన్న రంగారెడ్డి ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీరు కార్యాలయంలో తోటి ముగ్గురు ఉద్యోగులు సహా తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఈఈ అయిన నిఖేశ్‌కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి ఆయనపై అనుమానంతో ఏసీబీ అధికారులు ఓ నిఘా ఉంచారు. ఆయన వివరాలన్నింటినీ సేకరించారు. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన చిట్టాను రాబట్టారు. ఇక రంగంలోకి దిగారు.
తాజాగా ఏకకాలంలో నిఖేశ్‌కుమార్ ఇండ్లు, బంధువుల ఇండ్లలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు సోదాల్లో బట్టబయలవుతున్నది. ఇప్పటికే సుమారు రూ.150 కోట్లకు స్థిర, చరాస్థులు ఉన్నట్టు గుర్తించారు. నిఖేశ్ బహుళ అంతస్థుల భవనం మంజూరుకు 4 లక్షల నుంచి 50 లక్షల వరకు ఫిక్స్ చేసి వసూలు చేస్తారని అప్పట్లోనే హడల్. 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ప్లాట్లు, 2 కమర్షియల్ స్పేస్‌లు, ఐదు ఇండ్ల స్థలాలు ఉన్నట్టు పత్రాలు దొరికాయి. శనివారం ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని పలు ఇండ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆయన పేరిట 3 విల్లాలు, 3 ఫామ్‌హౌజ్‌లు ఉన్న్టు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకెన్ని ఆస్తులు లభ్యమవుతాయే తేలాల్సి ఉన్నది.