Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా తెలియకుండా ప్రాజెక్టు కట్టారని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ విమర్శలు
* పేరు మార్పు: మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టారు. గతంలో ఉన్న ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు.” అని అన్నారు.
* గుండెకాయ దెబ్బతింది: ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిందని, ఇది గత ప్రభుత్వ తప్పిదాల వల్లే జరిగిందని ఆరోపించారు.
* నిరుపయోగంగా బ్యారేజీలు: మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు గత 20 నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని ఉత్తమ్ తెలిపారు.
Also Read: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు
* ప్రణాళిక లోపం: వాప్కోస్ నివేదిక రాకముందే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది ప్రణాళిక లోపానికి నిదర్శనమని ఆయన అన్నారు.
* నీటి వినియోగం: ఏడాదికి 195 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని చెప్పి, ఐదేళ్లలో కేవలం 125 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని, అందులో కూడా 35 టీఎంసీలు సముద్రంలోకి వదిలివేశారని మంత్రి చెప్పారు. మొత్తం లక్ష కోట్ల వ్యయంతో కట్టిన ఈ ప్రాజెక్టుతో ఐదేళ్లలో కేవలం 101 టీఎంసీల నీరు మాత్రమే వాడుకున్నారని ఆయన లెక్కలు చెప్పారు.
హరీష్ రావు ఆగ్రహం: ‘అరగంటలో ఎలా మాట్లాడాలి?’
మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికపై కేవలం అరగంటలో ఎలా మాట్లాడతామని ప్రశ్నించారు. “రిపోర్టులో ప్రతి పేజీ, ప్రతి అక్షరానికి సమాధానం చెప్పడానికి నాకు కనీసం రెండు గంటల సమయం కావాలి.” అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
‘రాజకీయ కక్ష సాధింపు’:
హరీష్ రావు మాట్లాడుతూ, “ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది. మాజీ సీఎం కేసీఆర్, నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నివేదిక తయారు చేశారు. కోర్టులు కమిషన్లను రాజకీయ ఆయుధాలుగా వాడొద్దని చెప్పాయి.” అని అన్నారు. ఆదివారం నివేదిక సమర్పించడం వెనుక కుట్ర ఉందని, అందుకే సీఎం సుప్రీంకోర్టులో కేవియట్ వేశారని హరీష్ రావు ఆరోపించారు. “పారదర్శకత లేకుండా జరిగిన విచారణ నివేదిక చిత్తు కాగితంతో సమానం.” అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల సమస్యలు ముఖ్యం:
“ప్రస్తుతం ప్రజలు వరదలు, యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. బీఏసీ సమావేశంలో వరదలపై చర్చించాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళకి కాళేశ్వరం నివేదికపై చర్చ ముఖ్యం.” అని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

