Telangana: తల్లి, తండ్రి తర్వాత గురువును దైవంగా భావిస్తారు పిల్లలు. అలా భావించే కన్నకూతురు లాంటి ఆడపిల్లలపై గురువులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. అభంశుభం తెలియని పిల్లలపైనా దారుణాలకు ఒడిగట్టే దుండగులకు ఎన్ని శిక్షలు పడుతున్నా.. మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఇలాంటి దారుణమే శనివారం వెలుగులోకి వచ్చింది.
Telangana: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని నిడమనూరులో మోడల్ స్కూల్ ఉన్నది. ఈ స్కూల్‌లో చదువుతున్న ఏడో తరగతి విద్యార్థినులపై అక్కడి సాంఘిక శాస్త్రం సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు ఆంజనేయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తనతో టీచర్ ఆంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని ఏడో తరగతి విద్యార్థిని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. మరికొంత మందిపైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్థులు మోరపెట్టుకుంటున్నారు.
Telangana: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు నిడమనూరు మోడల్ స్కూల్ వద్ద శనివారం ఆందోళనకు దిగారు. దుండగుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.