Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో అక్రమ పద్ధతుల ద్వారా జరుగుతున్న ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం, అభ్యర్థులను బెదిరించడం లేదా ప్రలోభాలకు గురి చేసి బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో ఎస్‌ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఏకగ్రీవాలపై కఠిన వైఖరి
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి గురువారం నాడు జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ, నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే ఏకగ్రీవ ఫలితాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలన్నీ పాటించారా లేదా అనేది నిర్ధారించుకోవాలని ఎస్‌ఈసీ సూచించింది.
Also Read: Swiss Bank: అమ్మో స్విస్ ఖాతాల ఆస్తులు చూస్తే కండ్లు బైర్లు!
ఫలితాల ప్రకటనకు కొత్త నిబంధనలు
ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేసినా లేదా మిగిలినా, అక్కడ వేలంపాట, బెదిరింపులు లేదా ఆర్థిక ప్రలోభాలు జరిగినట్లు ఏవైనా ఫిర్యాదులు వస్తే, విచారణ జరిపి నిజమని తేలితే ఫలితాలను ప్రకటించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫిర్యాదులు రాని పక్షంలో కూడా, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థుల నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రాలు (డిక్లరేషన్) రాయించుకోవాలని సూచించింది.
ఈ ధ్రువీకరణ పత్రంలో, అభ్యర్థులు స్వచ్ఛందంగానే ఉపసంహరించుకుంటున్నామని, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిడి, వేలంపాట లేదా ఆర్థిక ప్రేరణకు గురికాలేదని స్పష్టం చేయాలి. అదేవిధంగా, ఏకగ్రీవంగా మిగిలిన అభ్యర్థి కూడా, తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బులు ఇవ్వలేదని, వేలంపాటలో పాల్గొనలేదని ధ్రువీకరిస్తూ ఒక పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వివరాలు అబద్ధమని నిరూపితమైతే, తన ఎన్నిక రద్దు చేయాలని కూడా అందులో పేర్కొనాలి.
ప్రత్యేక పర్యవేక్షణ విభాగం
ఏకగ్రీవాలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈ ఫిర్యాదులు లిఖితపూర్వకంగా, మౌఖికంగా, వాట్సాప్ ద్వారా లేదా వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల రూపంలో ఉన్నా స్వీకరిస్తారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే, ఆయా గ్రామ పంచాయతీలు లేదా వార్డుల్లో ఎన్నికను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపాలి. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం-2018లోని నిబంధనలను ఉల్లంఘించి ఏకగ్రీవాలు జరిగితే, ఆ ఎన్నిక చెల్లదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ నూతన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

