Telangana Rising 2047

Telangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!

Telangana Rising 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ – 2025 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించనున్న ఈ సదస్సు కోసం హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతోంది. దేశ, విదేశాల నుంచి విచ్చేస్తున్న ప్రముఖులను అబ్బురపరిచేలా, ఆధునిక సాంకేతికతతో కూడిన అద్భుతమైన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

సాంకేతిక మెరుపులతో భాగ్యనగరం శోభ!

సమ్మిట్‌కు రానున్న అతిథులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసింది.

చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్‌ భవనాలపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి, అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయనున్నారు.

సెక్రటేరియట్ వద్ద రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబిస్తూ అద్భుతమైన 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ సిద్ధమవుతోంది. ఇది రైజింగ్ తెలంగాణ – 2047 లక్ష్యాలను సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించనుంది.

దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్‌లో సమ్మిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్‌తో ప్రదర్శించనున్నారు.

హుస్సేన్ సాగర్‌లో ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను వాటర్ ప్రొజెక్షన్ ద్వారా చూపించనున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: అంత్య‌క్రియ‌లకు డ‌బ్బుల్లేక 3 రోజులు మృతదేహంతో నివ‌సించిన కుటుంబం

అతిథుల కోసం హైటెక్ స్వాగతం

శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే మార్గంలో భారీ డిజిటల్ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిపై వేదిక వివరాలు, దూరం వంటి సమాచారం అందుబాటులో ఉండనుంది. గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన 1500 రంగురంగుల జెండాలు నగరమంతా రెపరెపలాడనున్నాయి.

వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గాన్ని మొత్తం ఆధునిక 3డీ ఎనీ మార్ఫిక్ డిజైన్లతో రూపొందించారు. 50 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన డిజిటల్ టన్నెల్‌లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్‌తో ప్రదర్శిస్తారు.

దీంతో పాటు, నగరంలోని పది వేర్వేరు ప్రదేశాలలో ప్రత్యేక సమాచార స్టాల్స్‌ ఏర్పాటు చేసి, సమ్మిట్ వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, బ్రోచర్‌లను వలంటీర్ల ద్వారా ప్రజలకు అందిస్తారు.

కీలక చర్చాంశాలు, ప్రముఖుల ప్రసంగాలు

రెండు రోజుల సదస్సులో మొత్తం నాలుగు హాల్స్‌లో ఏకకాలంలో కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

మొదటి రోజు (డిసెంబర్ 8):

మధ్యాహ్నం 1:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:30కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం. ఆర్థిక రంగ నిపుణులు అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఎరిక్ స్వేడర్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు.

పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ మొబిలిటీ, టేక్ తెలంగాణ, తెలంగాణ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్, టాలెంట్ మొబిలిటీ, హెల్త్ కేర్ ఫర్ ఆల్, గిగ్ ఎకానమీ, రైతుల ఆదాయం పెంపుదల వంటి కీలకాంశాలపై చర్చలు ఉంటాయి.

రెండో రోజు (డిసెంబర్ 9):

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జీనోమ్ వ్యాలీ, తెలంగాణ ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్, 3 ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులు, మూసీ రిజునవేషన్, భారత్ ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్, స్టార్టప్ ఎకో సిస్టమ్ వంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.

సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మరియు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. రాత్రి 7 గంటలకు సదస్సు ముగింపు సందర్భంగా అద్భుతమైన డ్రోన్ షో ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

తెలంగాణ భవిష్యత్తు, అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ఈ సమ్మిట్, రాష్ట్ర ప్రగతికి ఒక కొత్త దారి చూపనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *