Telangana Assembly:భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్‌సింగ్ మృతికి తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. ఈ నెల 26న అనారోగ్యంతో ఎయిమ్స్‌లో కన్నుమూసిన మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీ నిగమ్ బోధ్‌ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మన్మోహన్‌సింగ్‌కు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Telangana Assembly:మన్మోహన్‌సింగ్ దేశానికి విశిష్ఠ సేవలందించారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నిర్మాణాత్మక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడారని, నీతి నిజాయితీలతో ఆయన పోటీపడేవారని అభివర్ణించారు. దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, ప్రధానిగా విశేష సేవలందించారని పేర్కొన్నారు. దేశానికి అద్భుత పాలన అందించిన మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న బిరుదుతో సత్కరించాలని కోరుతూ తీర్మానంలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో విగ్రహం ఏర్పాటు చేద్దామని తీర్మానంలో పేర్కొన్నారు.
Telangana Assembly:అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌సింగ్ సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు తదితరులు సంతాప తీర్మాన చర్చలో మాట్లాడారు. మన్మోహన్‌సింగ్ సేవలను ఈ సందర్భంగా వారంతా కొనియాడారు.