Thanjavur: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఆగ్రహంతో మదన్ (30) అనే ఓ యువకుడు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోనే టీచర్‌పై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలిని రమణి (26)గా గుర్తించారు. రమణి, మదన్‌లు ఒకరికొకరు పరిచయస్తులే. మదన్ పెళ్లి ప్రపోజల్‌ను రమణి నిరాకరించింది. ఈ విషయంలో వారి కుటుంబాల మధ్య కూడా చర్చలు జరిగాయి, కానీ రమణి ఈ వివాహానికి అంగీకరించలేదు. పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మదన్, బుధవారం ఉదయం స్కూల్ ప్రాంగణంలోకి వచ్చాడు. స్టాఫ్‌రూమ్ వద్ద రమణిని అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు.
Also Read: Vikarabad: వంట రాదని, భర్త వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య
ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. రమణి మెడపై లోతైన గాయాలయ్యాయి. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే స్పందించి రమణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్కూల్‌లో తీవ్ర కలకలం రేగింది. దాడి చేసిన వెంటనే మదన్‌ను అక్కడే ఉన్న ఉపాధ్యాయులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. టీచర్‌పై దాడిని సహించబోమని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు.

