Swiss Bank:అక్రమ ఆస్తులు, లెక్కకు మిక్కిలి సంపదను కలిగిన ఎందరో బడాబాబులు తమ ఆస్తిని స్వదేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న బ్యాంకుల్లో దాచి ఉంచినట్టు తేలింది. స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో ఈ సంపద ఉన్నట్టు మన కేంద్ర ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గుర్తించింది. వేలాది కోట్ల తమ విలువైన ఆస్తులను వారంతా అక్కడే సేఫ్ అని భావించినట్టు తెలుస్తున్నది. అయితే ఆ ఆస్తుల్లో ఐటీ శాఖ నుంచి తప్పించుకున్న ఆస్తి కూడా ఉన్నట్టు తేలింది.
Swiss Bank:విదేశీ ఖాతాల వివరాలను ఇప్పటికే కేంద్ర ఆదాయ పన్ను (ఐటీ) శాఖ సేకరించింది. ఈ మేరకు సమాచార మార్పిడి ఒప్పందం ఏఈఓఐ) ప్రకారం ఆ శాఖ సేకరించిన వివరాల లెక్కలు చూస్తే కండ్లు బైర్లు కమ్మే ఆస్తులు కండ్ల ముందు కనిపించాయి. ఐటీ శాఖ సేకరించిన వివరాల ప్రకారం.. విదేశాల్లో ఉన్న ఖాతాల్లో సుమారు రూ.29,208 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
Swiss Bank:ఇదే ఆస్తులతోపాటు దాదాపు రూ.1,089 కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా ఐటీ రిటర్న్స్‌లలో చూపలేదని ఆ శాఖ అధికారులు తేల్చారు. వివిధ దేశాల నుంచి అందిన సమాచారం మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్‌లతో ఐటీ శాఖ పోల్చి చూస్తే ఈ బడాబాబుల గుట్టు రట్టయింది.
Swiss Bank:ఈ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తేలింది. వివిధ ప్రఖ్యాత కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వీరందరికీ ఈ ఏడాది డిసెంబర్‌లోగా సవరించిన ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాలంటూ సమాచారం ద్వారా హెచ్చరికలు జారీ చేయనున్నది. గడువులోగా స్పందించకుండా తగు కఠినచర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Swiss Bank:దీంతో పాటు ఆ కఠిన చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలుస్తున్నది. వారందరిపై 30 శాతం మేరకు ఆస్తి పన్నుతోపాటు చెల్లించాల్సిన పన్నుపై ఐటీ శాఖ అదనంగా మరో రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇష్టారీతిన అక్రమ సంపాదన, ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను నుంచి తప్పించుకునే కుయుక్తులతో ఈ ఆస్తులను బయటకు తరలించినట్టు తెలుస్తున్నది.

