Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి, యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) దేవస్థానాన్ని సందర్శించారు. మ్యాచ్‌ల అనంతరం తీరిక దొరకడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన ఈ క్రికెటర్లకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
కోహ్లి, సుందర్ ఇద్దరూ మొదట ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని, ఆ తర్వాత బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం, అంతరాలయంలో స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దర్శనం పూర్తయిన తర్వాత, ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. దేవస్థానం అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
Also Read: Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
కోహ్లి రాకతో సందడి
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ఆలయానికి రాకతో సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఒక్కసారిగా సందడి నెలకొంది. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. కోహ్లి ఆలయంలో కొందరు భక్తులతో కలిసి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దైవ భక్తి అధికంగా ఉండే కోహ్లి, ఎక్కడికి వెళ్లినా సమయం దొరికితే అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లి, 45 బంతుల్లో 65 పరుగులు (నాటౌట్) చేసి, సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గా నిలిచిన విషయం తెలిసిందే.

