Smriti Mandhana: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన మరియు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం ఆకస్మాత్తుగా వాయిదా పడింది. నవంబర్ 23 (ఆదివారం) మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సిన వీరి వివాహం, పెళ్లి కుమార్తె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆకస్మిక అనారోగ్యం కారణంగా ఆగిపోయింది.
పెళ్లి ఇంట్లో విషాదం
సాంగ్లిలో ఉన్న స్మృతి మంధాన కొత్త ఇంట్లో గత కొన్ని రోజులుగా వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, ఆదివారం ఉదయం శ్రీనివాస్ మంధాన అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చిందని కొన్ని వార్తలు తెలిపాయి. పరిస్థితి విషమించడంతో, ఆనందకరమైన వాతావరణం ఉన్న పెళ్లి ఇంటికి అంబులెన్స్ వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను సాంగ్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad: ఫలించని కృషి.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు అన్ని పైరసీ
ఈ సందర్భంగా స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, స్మృతి తన తండ్రితో చాలా దగ్గరగా ఉంటుందని తెలిపారు. తండ్రి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో, ఆయన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని స్మృతి మంధాన నిరవధికంగా వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు మేనేజర్ వెల్లడించారు. వైద్యులు కూడా ఆయన మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మంధాన కుటుంబం గోప్యతను గౌరవించాలని మేనేజర్ విజ్ఞప్తి చేశారు.

