Smriti Mandhana: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడటానికి కారణమైన వరుస విషాదకర సంఘటనలు ఆ కుటుంబంలో తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. కొన్ని రోజుల ముందు నుంచే హల్దీ, మెహందీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో సందడిగా ఉన్న పెళ్లి ఇంట్లో, అకస్మాత్తుగా రెండు ప్రధాన అనారోగ్య సంఘటనలు చోటు చేసుకోవడంతో వాతావరణం విషాదంగా మారింది.
ఆదివారం గ్రాండ్‌గా జరగాల్సిన స్మృతి మంధాన పెళ్లికి కొన్ని గంటల ముందు, ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు (Heart Attack) రావడంతో వెంటనే సాంగ్లీలోని ఒక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన తండ్రితో ఎంతో అనుబంధం ఉన్న స్మృతి మంధాన, ఈ ఘటనతో తీవ్ర షాక్, మనస్తాపానికి గురయ్యారు. దీంతో పెళ్లి వేడుకను వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ప్రకటించారు.
Also Read: Kane Williamson: జట్టులోకి కేన్ విలియమ్సన్ కం బ్యాక్
వరుణ్ పలాశ్‌కు కూడా అస్వస్థత
తండ్రి అస్వస్థతతో స్మృతి మంధాన ఆందోళనలో ఉండగానే, కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం రాత్రి వరుడు పలాశ్ ఒక్కసారిగా అస్వస్థతకు లోనవడంతో, సన్నిహితులు వెంటనే ఆయన్ని ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం, పలాశ్ వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా అనారోగ్యం పాలయ్యారని వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆయన ఆరోగ్యం ప్రమాదకరమేమీ కాదని, చికిత్స అనంతరం వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ విధంగా, కొద్ది వ్యవధిలోనే తండ్రికి గుండెపోటు రావడం, ఆ వెంటనే కాబోయే భర్త కూడా ఆస్పత్రి పాలవడం వంటి వరుస ఘటనలతో స్మృతి మంధాన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు వారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రేమజంట చాలా ఏళ్ల పాటు తమ బంధాన్ని రహస్యంగా కొనసాగించి, పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్న సమయంలో ఈ వరుస దుర్ఘటనలు జరగడం పట్ల అభిమానులు, సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

