Siddipet: రోజువారీగా వెళ్లినట్టే ఆ తల్లీకూతుళ్లు ఇద్దరూ తోటి కూలీలతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లారు. పదో పరకో ఇంటి ఖర్చులకు వస్తయని భావించారు. వ్యవసాయ కూలి పనులు లేని ఈ రోజుల్లో ఉపాధి పని మాబంగారంగా భావించి ఊరంతా తరలివచ్చారు. అందరితో కలిసి ఆనందంగా పనులు చేస్తుండగా, ఒక్కసారిగా బండరాళ్ల రూపంలో మృత్యువు తరుముతూ వచ్చింది. ఆ తల్లీకూతుళ్లు ఇద్దరినీ కబలించేసింది.
Siddipet: ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలంతా పనుల నిమిత్తం శివారుకు వెళ్లారు. అక్కడే ఉన్న గుట్ట కింద పనులు చేస్తుండగా, గుట్టపై నుంచి రాళ్లు, మట్టి దిబ్బలు కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
Siddipet: సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కుందారపు సరోజన (52), ఆమె కూతురు మమత (25)గా పోలీసులు గుర్తించారు.

