Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ముఖ్యమైన సూచనలు చేశారు. డబ్బుల ఆశతో ప్రాణాలను హరించుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందేశాన్ని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియో రూపంలో పంచుకుంటూ, ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండాలని కోరారు.
“సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లారా! కేవలం డబ్బుల కోసం అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఆపండి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని మీరు చేసే ప్రచారం వల్ల ఎంతో మంది ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడుతున్నారు. ఈ వ్యసనానికి బలి అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు” అని సజ్జనార్ హెచ్చరించారు.
మీ స్వలాభం కోసం సమాజ ప్రయోజనాలను విస్మరించడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. ఈ ధోరణులు సమాజానికి ప్రమాదకరమని, ఇవి క్షమించరానివని పేర్కొన్నారు. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనే ఆలోచన అనర్థదాయకమని యువత అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
అలాగే, “స్వార్థం కోసం ప్రచారం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మవద్దు. ఈ బెట్టింగ్ యాప్‌లు చాపకింద నీరులా సామాజిక సమస్యలను పెంచుతున్నాయి. ఇలాంటి వ్యసనాలకు మరియు సంఘవిరోధ శక్తులకు దూరంగా ఉండండి” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.