Isha Gramotsavam: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం ఈశా గ్రామోత్సవం 16వ ఎడిషన్, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి ఎదుట ఇటీవల అద్భుతంగా ముగిసింది. రెండు నెలల పాటు సాగిన ఈ క్రీడా మహోత్సవంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలోని గ్రామాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని గ్రామాల్లో నిర్వహించారు.
ముగింపు వేడుకలో సద్గురు మాట్లాడుతూ, ఈ ఉత్సవాన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. అంతేకాకుండా X వేదికగా “ఈశా గ్రామోత్సవం భారతదేశపు గ్రామీణ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం. చిన్న ఈవెంట్ గా మొదలై, నేడు ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి విస్తరించి, మొత్తం లక్షకు పైగా ఆటగాళ్లు, ప్రేక్షకులు, నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. అయితే ఇది చాలదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇది జరగాలని మా ఆకాంక్ష.” అని వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ సద్గురు ఆలోచనను, ఈ పండుగ లక్షలాది మందికి అందిస్తున్న ఆనందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. “డెబ్భై ఐదేళ్ల అమ్మమ్మ స్కూలు పిల్లల్లా ఉత్సాహంగా ఆడటం చూస్తుంటే మనసు పులకించింది. వయసు, కులం, నేపథ్యం అనే తేడాలన్నీ పక్కనపెట్టి, మీరంతా ఆడిన తీరు, ఉత్సాహం, జోష్ నిజంగా స్ఫూర్తిదాయకం.” అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన సరదా శైలికి పేరుపొందిన ఈ దిగ్గజ క్రికెటర్, “అక్కలు ఉత్సాహంగా త్రోబాల్ ఆడే తీరుని చూసి నేను హక్కా బక్కా (ఆశ్చర్యపోయాను) అయిపోయాను” అని చమత్కారంగా అన్నారు.
ఇది కూడా చదవండి: Ind vs Aus: మెల్‌బోర్న్ టెస్టులో భారత్ ఓటమికి ఐదు కారణాలివే!
ఇక అందరూ ఊహించినట్లుగానే, పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ ఫైనల్స్ పోటాపోటీగా సాగాయి. ఈ రెండింటిలో కర్ణాటక, తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి. దివ్యాంగుల మధ్య జరిగిన పోటీలు కూడా అంతే ఉత్సాహభరితంగా సాగి, ఈ ఉత్సవం అందరినీ సమానంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని మరోసారి నిరూపించాయి. మొత్తం యాభై రెండు లక్షల ప్రైజమనీలో భాగంగా, విజేత జట్లకు ఐదు లక్షల రూపాయలు అందజేయడంతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది.
162 గ్రామీణ ప్రాంతాలు.. 43,000 మంది క్రీడాకారులు..
16వ ఈశా గ్రామోత్సవం 162 గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించబడింది. 43,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 10,000 మందికి పైగా గ్రామీణ మహిళలు – చాలామంది గృహిణులు – వాలీబాల్, త్రోబాల్లో పోటీపడ్డారు.
2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ సమాజంలో క్రీడా స్ఫూర్తిని, ఆటపాటల సంతోషాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే- ప్రొఫెషనల్ క్రీడాకారులను పక్కన పెట్టి, కూలీలు, మత్స్యకారులు, గృహిణులు వంటి సామాన్య పల్లె ప్రజలకు వేదిక కల్పిస్తుంది. దీని ద్వారా వారు రోజువారీ జీవితం నుండి కాసేపు దూరంగా, క్రీడల ద్వారా వచ్చే ఆనందాన్ని, ఐకమత్యాన్ని అనుభవించే అవకాశం పొందుతారు.
#IshaGramotsavam was an effort to raise the Rural Spirit of Bharat. From a modest event, today it is across five states and a Union Territory with over one lakh people in terms of participants, spectators and various other aspects. But this is not enough. We want this to happen… pic.twitter.com/qRK6gHuDKf
— Sadhguru (@SadhguruJV) December 29, 2024