Rs praveen kumar: తెలంగాణలో అరాచక శక్తులు పెచ్చరిల్లుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, నేర చరిత్ర ఉన్న చక్రధర్ అనే వ్యక్తితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఏదో ఒక కారణం చూపించి ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
యాదాద్రిలో రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఒట్టు పెట్టారని, కానీ ఆ మాట నిలబెట్టుకోలేదని హరీశ్ రావు ప్రశ్నించగానే ఆయనపై కేసు పెట్టారని ప్రవీణ్ ఆరోపించారు. అంతేకాదు, “ఎగవేతల రేవంత్ రెడ్డి” అన్నందుకు మానకొండూరులో కూడా కేసు పెట్టారని విమర్శించారు. చిన్న చిన్న విషయాల్లోనూ హరీశ్ పై కేసులు నమోదు చేయడం దురుద్దేశపూరితమని తెలిపారు.
రేవంత్ రెడ్డి లాంటి వారి తరహాలో హరీశ్ రావు ఓటుకు నోటు కేసులో లేరని స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. తాను కూడా ఒకప్పుడు ఐపీఎస్ అధికారిగా పనిచేశానని గుర్తుచేసుకుంటూ, సీఎంల ఒత్తిడి వచ్చినా ఐపీఎస్ అధికారులు పక్షపాతంగా వ్యవహరించకూడదని హితవు పలికారు.
హరీశ్ రావు, ఆయన అనుచరులపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

