Road Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన ఒక లారీ, ఇథనాల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
పెట్రోల్ బంకు సమీపంలో ఘటన
ఈ ప్రమాద ధాటికి ట్యాంకర్ తక్షణమే మంటల్లో చిక్కుకుంది. ఇథనాల్ కావడంతో మంటలు క్షణాల్లోనే భారీగా చెలరేగాయి. దురదృష్టవశాత్తూ, ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి సజీవదహనమయ్యాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: I Bomma Ravi: ఐ బొమ్మ రవి బయోపిక్ వచ్చేస్తుంది.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. హీరో ఎవరంటే?
అయితే, ఢీకొట్టిన లారీలోని డ్రైవర్‌ను మాత్రం స్థానికులు వెంటనే అప్రమత్తమై బయటకు తీసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. అతనికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇథనాల్ మంటలు కావడంతో అగ్నిని అదుపు చేయడం వారికి సవాల్‌గా మారింది. మూడు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

