Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మంగళవారం ఉదయం ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది. శ్రీశైలం టోల్‌గేట్ దగ్గర దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది మామూలుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ విషయం బయటపడింది. ఓ వ్యక్తి దగ్గర 9 ఎమ్ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే వారు అప్రమత్తమై అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు.
విచారణలో ఆ వ్యక్తి తాను మధ్యప్రదేశ్‌కు చెందిన సైబర్ క్రైమ్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. తన దగ్గర ఉన్న రివాల్వర్ లైసెన్స్ ఉన్న ఆయుధం అని, అధికారిక పనిమీద శ్రీశైలంకు ప్రయాణిస్తున్నానని పోలీసులకు వివరించాడు. ఈ విషయంలో అనుమానం రాకుండా ఉండేందుకు, శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు ఆ ఎస్ఐ గారి ఐడీ కార్డు, రివాల్వర్‌ను తమ అధీనంలోకి తీసుకుని పూర్తి దర్యాప్తు చేశారు.
పోలీసులు వెంటనే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో మాట్లాడి ఆ వ్యక్తి చెప్పిన వివరాలు నిజమో కాదో నిర్ధారించుకున్నారు. దర్యాప్తులో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ అని తేలింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకుని, స్వాధీనం చేసుకున్న రివాల్వర్, ఐడీ కార్డులను అతనికి తిరిగి అప్పగించారు. టోల్‌గేట్ దగ్గర జరిగిన ఈ ఘటన మొదట్లో కాస్త భయాందోళన కలిగించినా, చివరకు రివాల్వర్ ఉన్న వ్యక్తి నిజమైన పోలీసు అధికారి అని తేలడంతో అందరిలోనూ ఉత్కంఠ వీడింది. భక్తులు, స్థానికులు ఊరట చెందారు.

