Team India: భారత క్రికెట్ ఇప్పుడు స్పిన్ సుడిగుండంలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. గింగిరాలు తిరిగే బంతిని చూస్తేనే మనవాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. శ్రీలంకతో జరిగిన సిరీస్ లోనూ .. తాజాగా కివీస్ జట్టుపై కూడా స్పిన్ ఆడడంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ముప్పేదో ఉంటుందని కొన్నేళ్లు సంకేతాలు వస్తున్నా.. బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. స్టార్ ఆటగాళ్ల పేరిట దేశవాళీ టోర్నీలు ఆడించకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని తెలుస్తోంది.. ప్రపంచ క్రికెట్లో మేటి స్పిన్నర్లుగా పేరున్న షేన్ వార్న్, మురళీధరన్, సక్లయిన్ ముస్తాక్, వెటోరీల యుగంలోనే సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన టీమిండియా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొని దుర్భేద్యంగా మారింది. కానీ, ఇప్పుడు కోహ్లీ, రోహిత్ వంటి సూపర్‌స్టార్లు ఉన్నా.. పేకమేడ కంటే ఘోరంగా కుప్పకూలుతోంది.
టీమ్ ఇండియా స్పిన్ ఎదుర్కోవడంలో అవస్థలు పడటానికి పలు కారణాలున్నాయి. సూపర్‌స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం.. ఇప్పుడు జట్టులో కొంచెం సూపర్ స్టార్ హోదా రాగానే దేశవాళీ టోర్నీలను తేలిగ్గా తీసిపడేస్తున్నారు. స్పిన్నర్ల విషయంలో మన ఆటగాళ్ల బలహీనత గమనించిన బీసీసీఐ అందరూ కచ్చితంగా డొమిస్టిక్ మ్యాచ్‌లు ఆడాలని నిబంధన పెట్టింది. ఇదే సాకుగా ఇషాన్ కిషన్, అయ్యర్లపై వేటు వేసింది. కానీ, రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చి ద్వంద్వవైఖరిని చాటుకొందనేది కొందరి వాదన. వాస్తవానికి సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడితే.. స్పిన్నర్లను ఎదుర్కోవడం, ఫుట్‌వర్క్, బౌలర్ల యాక్షన్‌ను రీడ్ చేయడం అలవాటవుతాయి. కానీ ఇక్కడే తప్పు జరుగుతోంది. దేశవాళీ టోర్నీలపై చిన్నచూపే బ్యాటర్లకు పెను శాపంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల..
Team India: భారత స్టార్ బ్యాటర్లు లోకల్ క్రికెట్ ఆడరు. విరాట్ 2012, రోహిత్ 2015లో చివరి సారిగా యూపీపైనే రంజీమ్యాచ్‌లు ఆడారంటే మనోళ్లు దేశవాళీ మరిచి దశాబ్దకాం అవుతోందని . కాగా, మరోవైపు బీజీటీ సిరీస్ కోసం పాట్ కమిన్స్ ఇప్పుడు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. గతంలో సచిన్ టెండూల్కర్ కెరీర్ చరమాంకలో 2013 నవంబర్‌లో హరియాణాపై లాహ్లిలో రంజీ మ్యాచ్ ఆడాడు. అప్పట్లో ఆ మైదానం చుట్టుపక్కల కనీస వసతి లేదు. కానీ, సూపర్ స్టార్ హోదా ఉన్న సచిన్ దాదాపు ఆరు రోజులపాటు గ్రౌండ్‌లోనే ఒక రూమ్‌లో ఉండి మ్యాచ్ ఆడి 79 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
విరాట్ మాత్రం 2012లో చివరి రంజీ ఆడాడంటే ఇక స్పిన్ విషయంలో తడబ్యాటు అందుకే అని చెప్పుకోవచ్చు.. ఇటీవల కాలంలో విదేశాల్లో రాణించాలని భారత బ్యాటర్లు పేస్‌ను సాధన చేయడంపైనే దృష్టిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు త్రోడౌన్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా స్పిన్నర్ల బౌలింగ్ యాక్షన్ కదలికలను అంచనావేయడంలో బోల్తాపడుతున్నారు. ఇన్నాళ్లూ సూపర్ స్టార్లకు నెట్‌ప్రాక్టీస్ నుంచి కూడా మినహాయింపులున్నాయి. అంతేకాదు.. ప్రాక్టీస్ సెషన్లకు దేశవాళీగా నాణ్యమైన స్పిన్నర్లు లేరన్న వాదన కూడా ఉంది. దీంతోనే సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోందది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ గా మళ్లీ విరాట్ కోహ్లీ..?
Team India: ప్రస్తుత భారత జట్టులోని టాప్ బ్యాటర్లు సగటున స్పిన్ బౌలింగ్ లో చేస్తున్న పరుగుల సగటు సగానికి సగం తగ్గి పోయింది. 2016-2020 మధ్య భారత జట్టు టాప్-7 బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కొని సగటున 63 పరుగుల చొప్పున సాధించారు. అదే 2021 నుంచి ఇప్పటి వరకు సగాని పడిపోయి స్పిన్ బౌలింగ్ లో సాధిస్తున్న పరుగుల సగటు 37కు చేరింది. అప్పట్లో కింగ్ కోహ్లీ, పుజార ప్రత్యర్థుల స్పిన్ బౌలింగ్ ను కకావికలం చేశారు. కానీ, 2021 నుంచి కోహ్లీ 19, రోహిత్ 19, గిల్ 14, జైస్వాల్ 8, రాహుల్ 7సార్లు స్పిన్నర్లకు వికెట్లను సమర్పించుకొన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ ఆడేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్పిన్నర్లు భారత్‌కు వచ్చి.. ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకొని బౌలింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకొన్నారు. కానీ, వారిని ఆడిన మన బ్యాటర్లు మాత్రం ఏమీ నేర్చుకోలేదనిపిస్తుంది. శ్రీలంకలో దునిత్ వెల్లలాగే వంటి యువ స్పిన్నర్లు కూడా టీమిండియాను ఆటాడుకొన్నారు.
టీ20 సిరీస్‌లు, ఐపీఎల్, వన్డేలు కారణంగా బ్యాటర్లు ఫోకస్ మొత్తం బంతిని ఎడాపెడా బాదడంపైనే ఉంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో వికెట్లను కాపాడుకొనే డిఫెన్స్ గేమ్ అసలు పనికిరాదు.. కానీ, టెస్టుల్లో అదే ప్రాణం. గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయి ఆడాల్సి ఉంటుంది. వన్డే, టీ20 మ్యాచ్‌ల ప్రభావంతో బ్యాటర్లు టెస్టుల్లో కూడా హిట్టింగ్‌కే ప్రయత్నించి వికెట్లు సమర్పించుకొంటున్నారు. అంతేకాదు.. ఒకే స్పిన్నర్ పదేపదే దాడి చేసి వికెట్లు కూల్చే అవకాశం సుదీర్ఘ ఫార్మాట్లో ఉంది.ఓ పక్క స్పిన్‌లో భారత్ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు.. మరోవైపు దేశవాళీ మైదానాలు బంతి సుడులు తిరగడానికి అనుకూలంగా ఉంటాయి. దీంతో అనూహ్యంగా వచ్చే బంతులను ఆడేందుకు అవస్థ పడుతున్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇలాంటి పిచ్‌పైనే భారత్ ఓటమి పాలైంది. ఇక్కడ టాస్‌నిర్ణయం బాగా ప్రభావం చూపింది. ఇక న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టాసే మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. ఇలాంటి పిచ్‌లపై దూకుడైన ఆటతీరు ఓటమిని కొనితెస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.