Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి కొత్తగా చేరుతున్న వారికి ఆయన హెచ్చరికలు, సూచనలు చేస్తూ, “పార్టీలో చేరిన మొదటి రోజే సీట్లో కూర్చోబెడతారనే ఆశలు పెట్టుకోవద్దు. టికెట్ వస్తుందనే నమ్మకం కూడా ఉండదు. చివరికి ఎక్కడో పంపేస్తారు” అని వ్యాఖ్యానించారు.
“బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది ఏదీ దొరకదు. ఇక్కడ కుట్రలు, కుతంత్రాలు, బాధపెట్టడం, సంతోషపడటం వంటివి నేర్చుకోవాలి” అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. గత 11 ఏళ్లుగా గోషామహల్ అసెంబ్లీలో కొందరి వల్ల తాను అణచివేతకు గురవుతున్నానని, బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నమ్మిన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు నేతలు, కార్యకర్తలు ఎందుకు బీజేపీకి గుడ్‌బై చెప్పారో కొత్తగా పార్టీలో చేరేవారు తెలుసుకోవాలని సూచించారు. బీజేపీలో చేరే ముందు ఆ నేతలతో చర్చలు జరిపి పరిస్థితిని అర్థం చేసుకోవడం మంచిదన్నారు. “ఈ రోజు కాకపోయినా రేపు తెలంగాణ బీజేపీలో ఉన్న రాక్షసులు అంతమవుతారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, కార్యకర్తల ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై చర్చలు సాగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

